Posts

Showing posts from August, 2021

"ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్యే" ఏ వర్గాల చేతిలో అధికారం కేంద్రీకరించబడి వుంది,లేక ఏ వర్గాలను అధికారం నుండి కూల తోయాలి ?. ఏ వర్గం లేక ఏ వర్గాలు అధికారాన్ని చేపట్టాలి ?.ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య ఇదే—లెనిన్. కామ్రేడ్స్ మనదేశంలో విప్లవ పోరాట శక్తులకు కొదవలేదు. చరిత్ర అంతా విప్లవ పోరాటాల చరిత్త్రే .జాతీయ ఉద్యమంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తిరుగుబాటు, గదర్ వీరులు, భగత్ సింగ్, ఆజాద్ ,బిర్సా ముండా ,కొమరం భీమ్ మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ ,శ్రీకాకుళం ,జగిత్యాల నుండి నేటి వరకు వీరోచిత పోరాట చరిత్రే. ఇందులో వంద సంవత్సరముల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, బలిదానాలతో తెగించి పోరాడుతున్న చరిత్రే .తెగించి పోరాడే వీరులకు ప్రజలకు కొదవలేదు ,విరామం లేదు .వేలాది వీరులు అమరులైన చరిత్ర. అయితే " విప్లవంలో ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్య " అని లెనిన్ అన్నారు . మన విప్లవం ఎటువంటిది ఇది మన ప్రధాన సమస్య ."మన శత్రువు ఎవరు ,మిత్రులు ఎవరు సరిగా గుర్తించామన్నారు " -. మావో. మనదేశ కమ్యూనిస్టు పార్టీ పుట్టుక నుండి కూడా పై రెండు సమస్యలను గుర్తించడంలో మాటిమాటికి ప్రతి దశలో విఫలం అవుతూ వచ్చింది .జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో కానీ ,ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట విషయంలో కానీ, ఈ సందిగ్దత మూలంగా పోరాటమును మధ్యలోనే అనుచితంగా విరమించడం జరిగింది. అటు తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చీలికలు సిపిఐ ,సిపిఎం విడిపోవడం. ఈ విడిపోవడం లో కూడా సరైన సిద్ధాంత స్పష్టత మనకు కనబడదు. అటు తర్వాత ఏర్పడిన నక్సల్బరీ ఎమ్మెల్ పార్టీల ఆవిర్భావం పోరాటాన్ని ఉన్నత దశకు తీసుకువెళ్లారు. కానీ అందులో సిద్ధాంత లోపాల మూలంగా ఎన్నో చీలికలు పీలికలు అయిపోయింది .చైనా చైర్మన్ మన చైర్మన్ అతివాద దుందుడుకు వాదం ఒకవైపు , పార్లమెంటరీ మితవాదం రెండోవైపు .ఇక్కడ పూర్తిగా కూలంకషంగా చర్చించడం నా ఉద్దేశం కాదు . ఎన్ని చీలికలు ఏర్పడ్డప్పటికీ మన పోరాట విప్లవ దశను నిర్ధారించడంలో విఫలమై నారు అని చెప్పడం నా ఉద్దేశం. తిరిగి జగిత్యాల పోరాటంతో ఉవ్వెత్తున లేచిన పీపుల్స్ వార్ రాడికల్స్ దండకారణ్యం వరకు విస్తరించారు. కానీ ఇప్పటి పరిస్థితి రోజు రోజుకు అరణ్యంలోని గిరిజనులకు మాత్రమే పరిమితమవుతున్నది, ఉనికిని కోల్పోతున్న ది. ఇప్పటికీ దేశం అర్ధ వలస అర్ధ భూస్వామ్యం అంటూ నూతన ప్రజాస్వామిక విప్లవం దశలోనే ఉన్నామంటూ దాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఇది అర్ధ వలస అర్థ భూస్వామ్య వ్యవస్థ కాదు పెట్టుబడిదారీ సమాజం గా పరివర్తన చెందింది కాబట్టి సోషలిస్టు విప్లవం కావాలి అనేవారు పెద్ద సంఖ్యలోనే కోరుతున్నారు. చర్చ ఉన్నత దశలో సాగుతున్నది. ఎంగెల్స్ జర్మన్ విప్లవ పరాజయం గురించి చెబుతూ "ఈ విప్లవానికి, పరాజయానికి కారణాలు తప్పులు ద్రోహులలో అన్వేషించ కూడదని ,ఈ అల్లకల్లోలం లో చిక్కుకున్న ప్రతి దేశంలోని సహజ స్థితి ,దేశ పరిస్థితులు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవాలి " ( from revolution and counter revolution in Germany)-angels. వంద సంవత్సరముల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు ఉద్యమం ,విప్లవం విజయవంతం కాకపోవడానికి మన దేశ సామాజిక పరిస్థితులను సరిగా అర్థం చేసుకోక పోవడమే కారణం. మనది పెట్టుబడిదారీ సమాజం గా గుర్తించకపోవడమే కారణం. చాలా మందికి సందేహం ఏమిటంటే నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం అటు తర్వాత తిరిగి జగిత్యాల నుండి దండకారణ్యం వరకు జరిగింది, విప్లవపోరాటం కాదా?. పరిస్థితులు లేకుండా ఎలా జరిగింది. అవును భూస్వామ్య అవశేషాలు ఉన్న కారణంగానే భౌతిక పరిస్థితులు ఉన్న కారణంగానే రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం వల్ల అది పరిష్కారం అయిన వెంటనే తర్వాత దశకు పోరాటం కార్యక్రమం లేదు కనుక ఉద్యమం చల్లారింది . అదే సోషలిస్టు విప్లవ కార్యాచరణ అయితే ఆ ఉద్యమం ఇప్పటికీ నిలిచి ఉండేది .ఈ విషయం కొట్టవచ్చినట్లు కనబడడం లేదా ?. ప్రధాన లోపం ఇదే భూస్వామి పోయిన తర్వాత ప్రజలు ఏమి చేయాలి యుద్ధం ఎవరి పైచేయాలి?. నూతన ప్రజాస్వామ్య విప్లవానికి -సోషలిస్టు విప్లవానికి తేడాలు ఏమిటి?. నూతన ప్రజాస్వామిక విప్లవం లో జరిగిన లోపం ఏమిటంటే గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో, వైరుధ్యం భూస్వామ్య విధానానికి అశేష ప్రజానీకం కు మధ్య వైరుధ్యం ఉంటుంది. జాతీయ బూర్జువా , ధనిక మధ్యతరగతి కూడా మిత్ర వర్గమే. ధనిక వర్గం ,మధ్యతరగతి అంటే మన దేశంలో ఎక్కువగా అగ్రకులాలకు చెందినవారే ,విరి చొరవ ఆధిపత్యం ఫలితంగా , సంఘ నాయకత్వం విరి చేతిలోనే ఉంటుంది .మొదటి పోరాటం లోనే భూస్వాములు ఓడిపోతే,( పట్టణాలకు పారిపోయారు) తర్వాత పోరాటం ఏమి ఉంటుంది. తర్వాత అగ్రకుల ధనిక మధ్యతరగతికి ,పేద రైతాంగం దళిత బహుజన వర్గాలకు చెందిన రైతు కూలీలకు మధ్య ఉంటుంది .కానీ నూతన ప్రజాస్వామిక విప్లవం లో జాతీయ బూర్జువా ధనిక మధ్యతరగతి పేద రైతాంగం రైతు కూలీల మధ్య ఐక్య సంఘటన ఉండాలి. కాబట్టి సంఘ నాయకత్వంలో జాతీయ బూర్జువా ధనిక మధ్యతరగతి వర్గాలు ఆధిక్యంలో ఉంటాయి. వీరు పేద రైతాంగ దళిత బహుజన రైతుకూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటారు. వైరుధ్యం ఇక్కడే మొదలవుతుంది ,జరిగింది కూడా అదే. అందుకే నక్సల్బరి పోరాటం , జగిత్యాల ఉద్యమంలో దొరలు పట్టణాలకు పారిపోయిన తర్వాత గ్రామాలలో, వైరుధ్యం పరిష్కారం చేయలేని స్థితిలో నిరాశ చెందిన పేద దళిత బహుజన రైతు కూలీల క్రమంగా పార్టీకి దూరమై ,అస్తిత్వవాద అంబేద్కర్ ఉద్యమం వైపు వెళ్లారు .ఇలా తరలి పోవడం మూలంగా గ్రామాలలో పార్టీ తన పట్టును కోల్పోయింది . అందుకే మైదాన ప్రాంతాలలో పార్టీ బలహీనపడి అడివికి పరిమితమై పోవాల్సి వచ్చింది.ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భూస్వాములు పట్టణాలకు పారి పోయిన తర్వాత ,ధనిక, మధ్యతరగతి వర్గాల కు మరియు పేద రైతు,దళిత బహుజన కూలీలకు మధ్య వేతన,సామాజిక పెత్తనం,సంఘ నాయకత్వ మొదలగు సమస్యలను ఎందుకు పరిష్కరించ లేదు.కారణం దళాలు, పార్టీ ,గెరిల్లా జోన్ లు,విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి కనుక ,ముందుగా అందరి ఇక్యసంఘటన తో మాత్రమే ఇది సాధ్యం.విప్లవం విజయం సాధించే వరకు ఇది చేయ లేము,ఇది కారణం.మిత వాద పార్లమెంటరీ ml party లు బలంగా వున్న దగ్గర వారే ధనిక వర్గ స్థానాన్ని పొంది,గ్రామ సర్పంచ్,ఎంపీటీసీ,ఎమ్మెల్యే లుగా,పాలక బూర్జువా పార్టీల స్థానాన్ని భర్తీ చేసి మనుగడ సాగిస్తున్నారు. క్రూరనిర్భందం మూలంగా పిపుల్స్వార్,రాడికల్స్ కు చెందిన గ్రామాలలో సంగము నాయకత్వం నుండి తప్పుకొని రద్దై పోయి, బూర్జువా పార్టీ లకు స్థానం కల్పించారు. ఇక జాతీయ స్థాయిలో జాతీయ బూర్జువా వర్గం తో ఐక్య సంఘటన కొరకు బూర్జువా ప్రాంతీయ పార్టీలతో ఐక్య సంఘటన కొరకు ప్రయత్నించి ఘోరంగా విఫలం అయ్యారు .ఉదాహరణకు ఎన్టీఆర్ ,మమతా బెనర్జీ , కెసిఆర్ లు,..... చర్చల పేరుతో చాలా నష్టపోయారు. ఇక పట్టణ కార్మిక వర్గంలో పార్టీ ఉనికే లేదు. అదే సోషలిస్టు దశ అయితే ఎలాంటి ఐక్య సంఘటనలు, బర్జువాలతో కానీ,గ్రామీణ బూర్జువా లయిన అగ్రకుల ధనిక వర్గాలతో ఉండవు. భూస్వాములు పట్టణాలకు పారిపోయిన వెంటనే కార్మిక రైతు కూలీల రైతాంగ మధ్య మాత్రమే ఐక్య సంఘటన ఉంటుంది. గ్రామాలలో నాయకత్వం పేద దళిత బహుజన రైతుకూలీ శ్రామిక,కార్మిక వర్గాల నాయకత్వంలో ఉంటుంది. గ్రామీణ బూర్జువా వర్గంపై పోరాటంలో దళిత బహుజనుల మధ్య కార్మిక వర్గ సామరస్యం అనివార్యంగా ఏర్పడుతుంది ,ఇది కుల వివక్షకు గల పునాది తొలగించి, వివక్ష ,అసమానతలు తొలగిపోతాయి. ఇక పట్టణాలలో కార్మికవర్గం మరియు అసంఘటిత కార్మిక వర్గం మధ్య ఐక్యత ఏర్పడి బూర్జువా వర్గం పై నిర్ణయాత్మక పోరాటానికి దారి ఏర్పడుతుంది. గ్రామాలలో భూస్వామ్యం పోయిన తర్వాత లేని భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఎవరిపై , అలాగే అర్ధ వలస కాదు కాబట్టి లేని దళారీ బూర్జువా పై ఏమి పోరాటం చేస్తాము. ఐక్య సంఘటన పేరుతో గ్రామాలలో అగ్రకుల ధనిక మధ్యతరగతి కి పట్టణాలలో దళారీ బూర్జువా లకు వ్యతిరేకంగా , జాతీయ బూర్జువా తో మైత్రి పేరుతో కార్మిక వర్గానికి , అసంఘటిత కార్మిక వర్గాలకు పోరాట కార్యక్రమం లేకుండా చేసింది. లేని అర్ధ భూస్వామ్యం అర్ధ వలస వ్యతిరేక పోరాటాల పేరుతో" గ్రామాలలో ధనిక వర్గాన్ని "(గ్రామీణ బూర్జువా ను)" పట్టణాలలో జ జాతీయ బూర్జువాల(పెట్టుబడి దారీ వర్గాన్ని) ను పటిష్టం చేయడమే నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమము." ఆదివాసుల లో వర్గాలు లేవు కనుక వాటికి రాజ్యం తో ప్రత్యక్ష వైరుద్య మూలంగా ఉద్యమం దండకారణ్యంలో ఇంకా కొనసాగుతుంది. దేశంలో పట్టణీకరణ విపరీతంగా పెరిగి కార్మిక అసంఘటిత కార్మిక వర్గం గణనీయంగా పెరిగింది వీరిని ఏ విధంగా విప్లవ పోరాటంలో కలుపుకోవాలి. విప్లవ దశ ను సరిగా నిర్ధారించు కుంటే దేశంలో పోరాడే శక్తులకు కొదవలేదు , మనకున్న సమస్యల అల్లా సరైన విప్లవ దశ , మరియు సిద్ధాంత సమస్య. ప్రస్తుతం ఒక సరైన సైద్ధాంతిక రాజకీయ పందా కలిగిన బోల్షెవిక్ తరహా నూతన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తక్షణ అవసరం. దానికొరకు మార్క్సిజం-లెనినిజం వెలుగులో విస్తృత సిద్ధాంత అధ్యయనం చేద్దాం. కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందించే నిరంతరం అధ్యయనాన్ని కొనసాగిద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఉద్యమకారులకు సైద్ధాంతిక పరిజ్ఞానం లేనితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. పడికట్టు పదాలు ఎంత కాలం నిలుస్తాయి . పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ? ,భూస్వామ్య విధానం అంటే ఏమిటి?, దళారీ బూర్జువా వర్గం అంటే ఏమిటి ?,కార్మికవర్గం రైతాంగం రైతుకూలీలు కార్మికులు అంటే ఏమిటి?. సరైన డెఫినిషన్ కూడా ఇవ్వలేని బలహీనత లో ఉన్నాం. సిద్ధాంత పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది .అది అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగా విప్లవ దశను సరిగా ఎలా నిర్ధారించాలి ,విప్లవ దశ ఏమిటి .దీని కొరకు బత్తిని శ్రీనివాసరావు గారి " నూతన ప్రజాతంత్ర విప్లవ మా -సోషలిస్టు విప్లవం మా "అనే ఈ పుస్తకం తిరిగి ముద్రణ చేయవలసిన అవసరం ఏర్పడింది ,మిత్రులు, మేధావి మరియు విద్యార్ధి లోకం అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది అని నేను భావిస్తున్నాను. మన విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్య దేశంలో అధికారం లో వున్నది పెట్టుబడి దారీ వర్గం, కూల దోయాల్సింది పెట్టుబడి దారీ వర్గాన్ని.అధికారం లోకి రావాల్సింది కార్మిక వర్గం. సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి. Sk.అబ్దుల్ కరీం 14-8-2021.