చదివారా?
📕📕📕📕📕📕📕📕📕
*ఎందుకు సోషలిస్టు విప్లవం?* ( రచన *షేక్ అబ్దుల్ కరీమ్* )
*పరామర్శ : వి. విజయ కుమార్*
*
పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ కార్యక్రమాన్నీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ విధానాన్నీ, కార్మిక వర్గ అంతర్జాతీయతకు కట్టుబడి పని చేసే ఒక నూతన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ఆవశ్యకతనూ గుర్తించి, దానికై ప్రచార ఉద్యమాన్నీ, నిర్మాణ కార్యకలాపాల్నీ నిర్వహించే ఒక రాజకీయ నిర్మాణ వేదికగా, శాస్త్రీయ కమ్యూనిజపు మార్గదర్శకత్వంలో నడిచే కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ తరపున షేక్ అబ్దుల్ కరీం గారు ఎందుకు సోషలిస్టు విప్లవం? అనే పేరున వేర్వేరు సందర్భాల్లో రాసిన ఇంచుమించు 18 అంశాలను ఒక పుస్తక రూపంగా వెలువరించారు. ఆయా వ్యాసాల్లో వేరువేరు సందర్భాల్లో సోషలిస్టు విప్లవ అంశాలను తడిమారు.
సంక్షిప్తంగా కొన్ని విషయాల్ని ఇందులో సమీక్షించాను.
1994 లో పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తానెంత సంఘర్షణకు లోనైందీ, కామ్రేడ్ కె ఎస్ సంక్షోభానికి మూల కారణాలు అన్వేషిస్తూ సాగిన అధ్యయనం ద్వారా తనకు ఒక సమాధానం ఎలా లభించిందీ, దాని పర్యవసనాల ఫలితంగా అది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ మార్గమేననీ,
తానెలా నిర్ధారణకు వచ్చారో నా మాటలో ముందుగా స్పష్టంగా చెబుతారు కరీం.
ప్రతీ విప్లవం యొక్క సమస్య రాజ్యాధికార సమస్యే నన్న వ్యాసంలో, భారతీయ కమ్యూనిస్టు పార్టీలు స్వాతంత్ర ఉద్యమంలో గానీ, తెలంగాణ సాయుధ పోరాట విషయంలో కానీ, శత్రువు ఎవరో, మిత్రులెవరో తేల్చుకోలేని సందిగ్ధత మూలంగానే పోరాటాలని అనుచితంగా మధ్యలోనే విరమించడం జరిగిందనీ, అంటే దానర్ధం పోరాట విప్లవ దశని నిర్ధారించడంలో విఫలం కావడమేననీ అంటారు కరీం. భారత వ్యవస్థను ఇంకా అర్థ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థగా భావిస్తూ ఉండటం సరికాదనీ, అది ఇప్పటికే పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందిందని చెబుతారు. భూస్వామ్య అవశేషాలున్న కారణంగా రైతాంగ ఉద్యమాలు లేచినప్పటికీ, తర్వాత దశకు తగిన సోషలిస్టు విప్లవ కార్యాచరణ లేకపోవడమే ప్రధాన లోపం అంటారు. రైతాంగ పోరాటాల తర్వాత దొరలు పట్టణాలకు పారిపోయిన తర్వాత, నిరాశ చెందిన పేద దళిత, బహుజన రైతు కూలీలు అస్తిత్వవాద, అంబేద్కర్ ఉద్యమం వైపుకు ఎందుకు వెళ్లారో; ఫలితంగా పార్టీ తన పట్టును ఎలా కోల్పోయిందో చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్లలా పారిపోయిన వెంటనే, కార్మిక, రైతు కూలీల, రైతాంగం మధ్య మాత్రమే ఐక్య సంఘటన ఏర్పడి ఉండాల్సిందని భావిస్తారు.
నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమాన్ని, ‘లేని అర్ధ భూస్వామ్య, అర్ధవలస వ్యతిరేక పోరాటాల పేరుతో గ్రామాల్లోని ధనిక వర్గాన్నీ (గ్రామీణ బూర్జువా), పట్టణాల్లోని పెట్టుబడిదారీ వర్గాన్నీ (జాతీయ బూర్జువా) పటిష్టం చేయడంగా విమర్శిస్తూ, మనకున్న సమస్యల్లా సరైన విప్లవ దశను నిర్ధారించుకోవడమూ, సరైన సిద్ధాంతాన్ని; అంటే, బోల్ష్ విక్ తరహా నూతన కమ్యూనిస్టు పార్టీని నిర్మించుకోవడమేననీ - అదే సరైన మార్గం అంటూ స్పష్టం చేస్తారు. దీనికి మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంత అధ్యయనం అత్యవసరం అంటారు.
కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటన్న వ్యాసంలో సైతం ఇంచుమించు సిద్ధాంత దారిద్రియాన్నీ, స్పష్టత లేమినీ వక్కాణిస్తూ, ‘కమ్యూనిస్టుల మధ్య ఐక్యతకూ, ప్రజాస్వామిక ఐక్య సంఘటనకూ మధ్య మౌలికమైన తేడాను గమనించాలనీ -' ప్రస్తుత తక్షణావసరం కమ్యూనిస్టులు ఐక్యమై, ఒక సరైన రాజకీయ శాస్త్రీయ కమ్యూనిజపు వెలుగులో ఒక విప్లవ సిద్ధాంత పంథాను కలిగిన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణమే’ లక్ష్యంగా చేసుకోవాలంటారు.
నిర్వాసితుల సమస్యపై వ్యాఖ్యానిస్తూ, ప్రాజెక్టుల, నదుల, డ్యామ్, మైనింగ్, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడి విస్తృతి సందర్భంలో జరిగే “అభివృద్ధిని” అడ్డుకొనడాన్ని, రష్యన్ విప్లవ సమయంలో నరోద్నిక్ వైఖిరితో పోల్చుతూ, ఆదివాసి, గిరిజన సంస్కృతులను కాపాడుకోవాలని కోరుకోవడం వెనుక పెటీ బూర్జువా మేధో భావోద్వేగమే ఉందంటారు కరీమ్!
“పల్లే కన్నీరు పెడుతుంది…” పాటను ప్రస్తావిస్తూ, పెట్టుబడిదారీ విధానం నిజానికి ఫ్యూడల్ సంబంధాలనీ, కులవృత్తుల్నీ ధ్వంసం చేసినప్పటికీ, దీన్ని అనివార్య చారిత్రక సామాజిక పరిణామంగా తీసుకోవాలంటారు.
“గ్రామీణ ప్రాంతాన్ని తప్పుడుగా ఆదర్శవంతం చేయడంగా” లెనిన్ నరోద్నిక్ లపై చేసిన విమర్శను ఈ సందర్భంలో ఉటంకిస్తారు. అందుకే కమ్యూనిస్టులు ఈ పెటీ బూర్జువా మేధావుల ఫ్యూడల్ భావజాల పునరుద్ధరణ శక్తులకు వంత “పాడ”(పాట) కూడదంటారు.
కమ్యూనిస్టు విప్లవ పార్టీలన్నీ కార్మిక పోరాటాన్ని మర్చిపోయాయనీ, పర్యావరణం, సెజ్, ఓపెన్ కాస్ట్ పరిధి దాటి ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, దారిద్రం, నిరుద్యోగం, ట్రాఫికింగ్, అధిక ధరలు, కనీస వేతన చెల్లింపులు, అవినీతీ, లంచగొండితనం లాంటి విస్తృత ప్రాతిపదిక నేపథ్యంతో పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించాలని చెబుతారు కరీమ్.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో చెబుతూ, “పెట్టుబడిదారీ వర్గం కొంతమంది కార్మిక సెక్షన్లను కొనేయడం ద్వారా కార్మికుల్లోనే అధిక సౌకర్యాలు కలిగిన ఒక ఉన్నత పొరను తయారు చేస్తారని” మార్క్స్ హెచ్చరించినట్లే, ప్రభుత్వ రంగాన్ని కాపాడటమంటే, ప్రైవేట్ రంగాన్ని కాపాడటమేననీ, అంటే పెట్టుబడిదారీ వర్గాన్ని కాపాడటమేననీ, ప్రభుత్వ రంగ లాభాలన్నీ సొంతం చేసుకునేది వాళ్లేననీ, విద్యా, వైద్యం, రవాణా రంగాలు కూడా సరిగ్గా ఇవే బాటలో నడుస్తున్నాయని నిరూపిస్తారీ వ్యాసంలో.
ఈవీఎం ట్యాంపరింగ్ వివాదంపై స్పృశిస్తూ, “బూర్జువా పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి వారి మీడియా, ఈవీఎం ట్యాంపరింగ్, రిగ్గింగ్ లాంటి వివాదాల్ని ప్రచారంలో ఉంచుతాయనీ, ప్రగతిశీల వాదులూ, విప్లవ వాదులూ ఈ వివాదాల్లో మునక్కుండా, సరైన సామాజిక వర్గ విశ్లేషణతో, సరైన మార్గంలో తమ అవగాహనను ఏర్పరచుకొని, మారుతున్న సమాజానికనుగుణంగా తమ సిద్ధాంత సంస్థాగత బలహీనతల్ని సవరించుకొని, బూర్జువా వర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, పీడిత ప్రజల కార్మిక వర్గ పార్టీని నిర్మించి సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాలని” భావిస్తారు.
గద్దర్ తండ్లాట గురించి రాస్తూ, ఫ్యూడల్ భూస్వామ్య విధానంపై ఇంకా గాలిలో యుద్ధం చేయడం సరైనది కాదనీ, గ్రామీణ వ్యవసాయ రంగం పెట్టుబడిదారీ సంబంధాల్లోకి వెళ్లిపోయిందనీ, “దొర ఏందీరో… దొర పీకుడేందిరో…” గతం అనీ, దొరలిప్పుడు పెట్టుబడిదారులనీ, పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ దశను గుర్తించడంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్న తరుణంలోనే అమరుడై వెళ్లకపోతే బహుశా సోషలిస్టు విప్లవ దిశగా గళం విప్పి పోరాడి ఉండేవాడేనేమోనని, గద్దర్ తప్పుదారుల్ని ఒకవైపు విమర్శిస్తూనే, రెడ్ సెల్యూట్ అర్పిస్తారు కరీమ్!
ఎందుకు ఇది రిహార్సల్? అనే వ్యాసంలో, “వర్గ వైరుధ్యాలు ముదిరినప్పుడు, సంక్షోభం తీవ్రతరమైనప్పుడు, స్వల్పకాలంలోనే రాజకీయ మార్పులు వేగంగా మారుతాయన్న” మార్క్సిస్ట్ భావనని, ఢిల్లీని ముట్టడించిన రైతాంగ ఉద్యమం, జరగబోయే సోషలిస్టు విప్లవానికి ఒక డ్రెస్ రిహార్సల్ ఎలా అవుతుందో విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా విప్లవ కమ్యూనిస్టులు అర్థవలస, అర్థ భూస్వామ్య భావనలను సరిచేసుకుని, పెట్టుబడిదారీ సమాజ పోకడని గుర్తించి, అప్డేటెడ్ పంథాలోకి మారకపోతే ప్రజల నుంచి దూరం అవుతారని కరాకండిగా చెప్తారు.
అలానే అగ్రకుల ధనిక వర్గంపై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని దశలో విప్లవోద్యమం నుంచి దళితులు క్రమంగా వేరవుతూ అస్తిత్వవాదం, అంబేద్కర్ వాదం వైపు ఎలా వెళ్లారో వివరించే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో బూర్జువా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనే కొందరు కామ్రేడ్ల పిలుపు గురించి వ్యాఖ్యానిస్తూ, ఇది సైద్ధాంతిక దివాలా కోరుతనంగా ఎండగడతారు.
ఆధునిక కార్మిక వర్గం గురించి మాట్లాడుతూ, “పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే కార్మికులనీ, మిగిలిన రంగాల్లో పనిచేసే కార్మికులు కార్మికులే కాదనే ఒక గుడ్డి నమ్మకం” సరైంది కాదనీ, శ్రమ శక్తిని అమ్ముకుని జీవించే ప్రతి ఒక్కరూ కార్మిక వర్గమేనని భావించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసంలో చెప్తారు.
చరిత్ర ఎప్పుడు అనుకున్న గతి తార్కిక పద్ధతిలో ముందుకు సాగదనీ, విప్లవ దిశలో ఎదురయ్యే అనుభవాలను బట్టి దిశా నిర్దేశం చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్లడమే సరైనదనీ, ఉదాహరణగా ప్యారిస్ కమ్యూన్, రష్యన్ విప్లవం, చైనా విప్లవం, నక్సల్బరీ విప్లవాలను ఉదహరిస్తూ; వచ్చిన అనుభవాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లడమే సరైన ఆచరణాత్మక పద్ధతిగా అభిప్రాయపడతారు కరీం.
యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మార్క్సిస్టులు ఏం చేయాలో చెబుతూ బూర్జువా ప్రజాస్వామిక సంస్కరణలను స్వాగతిస్తూ, వాటిలోని లోపాల్ని ఎత్తిచూపుతూ, మిగతా సామాజిక ఆర్థిక సమానత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయకూడదని ప్రశ్నిస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తో పాటు ఆర్థిక సమానత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటారు.
ఈ పుస్తకానికి అనుబంధంగా 2022 ఫిబ్రవరి 7 - 9 తేదీల మధ్య జరిగిన కమ్యూనిస్టు కార్యకర్తల కన్వెన్షన్ ఆమోదించిన కార్యక్రమ 11 తీర్మానాల్ని ఇందులో (బత్తిన శ్రీనివాసరావు గారు కన్వీనర్ గా) పొందుపరిచారు.
ఇంకా స్థలాభావం వల్ల నేను ప్రస్తావించని అనేక ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో కరీం గారు చర్చించారు. సోషలిస్టు విప్లవాన్ని స్వాగతించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. కరీం గారికి అభినందనలు.
ఈ పుస్తకం ప్రముఖ బుక్ షాపుల్లో అందుబాటులో ఉంచారు. పేజీలు 64: వెల 50 రూపాయలు.
వి. విజయకుమార్
*
Comments
Post a Comment