గద్దర్ తండ్లాటకు

 *గద్దర్ తండ్లాటకు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ పంథానే సరైన మార్గం!!* 


గద్దర్ తండ్లాటకు పరిష్కారం సోషలిస్టు విప్లవ పంథానే సరియైనది. సోషలిస్టు విప్లవ పంథా ఎందుకు!?  

నాడు గద్దర్ తొలినాళ్లలో వున్న భూస్వామ్య, ఫ్యూడల్ విధాన అవశేషాలు నేడు లేవు. సుదీర్ఘ  నక్సల్బరీ విప్లవ పోరాటాలు, ప్రజాస్వామిక ఉద్యమాల మూలంగా, సామ్రాజ్యవాద పెట్టుబడి అభివృద్ధి మూలంగా 90వ దశకం మధ్యలో  గణనీయంగా పెట్టుబడి  గ్రామీణ వ్యవసాయ రంగాన్ని  పెట్టుబడి దారీ సంబంధాలలోకి మార్చి వేశాయి. ఉద్యమాల వల్ల భూస్వాములు పట్టణాలకు, నగరాలకు పారిపోవడం... అక్కడే పెట్టుబడిదారీ విధానంలో

తమ వ్యాపారాలు, పరిశ్రమల ద్వారా వచ్చే సంపద భూస్వామ్య వ్యవసాయానికి  మించి కొన్ని రెట్లలో వుండడం, రియల్ ఎస్టేట్ లో విపరీత లాభాలు రావడం వల్ల అక్కడే సెటిల్ అయ్యారు. నామ మాత్ర భూ సంబంధాలు మిగిలాయి. అవి పెట్టుబడి సంబంధాలుగా మారాయి. ఈ కాలంలో గ్రామీణ వృత్తులు నశించి, వృత్తి కారులు పట్టణాలకు  వలసలు వెళ్లి పట్టణ కార్మికులుగా మారి పోయారు. 

"పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటనే సాక్ష్యం".

మారుతున్న పెట్టుబడిదారీ విధానంకు అనుగుణంగా పార్టీ తన నూతన ప్రజాస్వామిక విప్లవం విధానంను అప్డేట్ చేసుకోలేదు. తన కరడు గట్టిన 50 సం.క్రితం 

నూతన ప్రజాస్వామిక విప్లవంను ఇంకా అమలు చేయడం., దున్నే వానికే భూమి అని, ఇంకా వ్యవసాయక విప్లవం జరగాలి అంటూ., లేని భూస్వామ్య విధానంపై గాలిలో యుద్ధం చేస్తున్నారు.

సుదీర్ఘ విప్లవ పోరాటం వల్ల  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంధాలలో గణనీయ మార్పులు జరిగినా 

అవి "వక్రికరించబడిన పెట్టుబడిదారీ సంబంధాలు" అని మార్క్సిస్ట్  యేతర సూత్రీకరణ చేసి, ఇంకా భూస్వామ్య వ్యవస్థ వుంది కాబట్టి వ్యవసాయ విప్లవమే  ఇంకా కొనసాగాలి., భూములు పంచాలి అంటున్నారు.

ఇక కళాకారుడు ఏ విధమైన దృష్టితో, తన పాటను  మలచాలి. వ్యవసాయ విప్లవ పాటలు, సాహిత్యము పెట్టుబడిదారీ విధానంలో పనికిరావు. ప్రధాన వైరుధ్యంపై అంటే పెట్టుబడిదారీ దోపిడీపై పోరాడే కార్మిక శ్రామికుల వైపు వుంటేనే ప్రజలు

ప్రస్తుతం స్వీకరిస్తారు. వర్గ పోరాటంకు దోహద పడుతుంది. దొరయెందిరో దొరపీకుడేందిరో పాట ప్రపంచ  ప్రఖ్యాతి పొందిన పాటనే,

ఇపుడు పాడినా వింటారు., కానీ ఒకప్పటిది అని మాత్రమే, ఇపుడు దొరల మీద యుద్ధం లేదుగా. అలాగే సాహిత్యంలో అల్లం రాజయ్య  కతలు, నవలలు 90 ల వరకు నిరాటంకంగా వచ్చేవి. ప్రజలను చైతన్యం చేసేవి. వాటి కోసం

ఎదురు చూసే వారు. ఆ తర్వాత ఆ సాహిత్యం కొనసాగింపు ఏది.? ఊరు నవల ఒకప్పుడు సమకాలీన గ్రామ పోరాట సంఘటనలుగా వుండేవి. నేడు అది చరిత్ర మాత్రమే.

గద్దర్ లో 90 ల తర్వాతనే ఈ సంఘర్షణ పార్టీ విధానంకు తనకు, స్పష్టత లేకున్నా ఇతర రూపాలతో ముందుకు వచ్చింది. క్రమంగా దూరం పెరుగుతున్న దశలో అస్తిత్వ ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లు మొదలు కావడంతో తన దృష్టిని వీటిపై మళ్ళించడంతో

తాత్కాలికంగా పాక్షిక  సంతృప్తి చెందాడు.

నక్సల్బరీ నుండి శ్రీకాకుళం, జగిత్యాల జైత్రయాత్ర నుండి దండకారణ్యం వరకు వ్యాపించిన ఉద్యమం 90 ల నుంచి క్రమంగా

క్షీణిస్తూ తెలుగు రాష్ట్రాలలో కనుమరుగు కావడం ఎందుకు జరుగుతున్నది? కారణాలు వెతుకుతూ, అస్తిత్వ ఉద్యమంలో కూడా అతనికి పూర్తి సంతృప్తి, ప్రజల విముక్తికి మార్గం దొరకలేదు. అంబేడ్కర్ తో మార్క్సిజం జోడించాలి అనుకున్నాడు అదీ కూడా  సరైన దారీ చూప లేదు. అది కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పక్కకు పోయింది. భౌగోళిక తెలంగాణా మాత్రమే సాకారం అయిన తర్వాత  మరల అస్తిత్వ, మార్క్సిజం కలయిక ద్వారా ఏమైనా

మార్గం దొరుకుతుంది అని ప్రయత్నాలు చేశాడు. దొరక లేదు. ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమంలో ఐక్య కార్యాచరణలో భాగంగా ఇతర బూర్జువా పార్టీలతో  సన్నిహితంగా మెలగాల్సిన అవసరం వుండి, పరిచయాలు  ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోటే అందరి దగ్గరకి వెళుతుంటాడు. దానిలో చేరడానికి కాదు.

ఇంకా ప్రజల లోతుల్లోకి, మూలాలలోకి వెళ్ళే ప్రయత్నంలో యాదాద్రి, భద్రాచలం, రామానుజం, ఇంకా ...

కాంగ్రెస్ వేదికలను ఉపయోగించుకునే దానిలో భాగంగా రాహుల్ కు ముద్దు కూడా పెట్టాడు. 


ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పులిని పట్టటానికి పులి గుహలోకి వెళ్ళాలి కదా అన్నాడు. ప్రయోగాలు చేస్తున్నాను అన్నాడు. మనిషన్న వాడు ఉద్యమ కారుడు, ప్రజా కళాకారుడు నిరంతరం చలనంలో వుండాలి.  ప్రజలలో వుండి, ప్రజల స్థాయికి వెళ్లి చైతన్యం  చేసి ఉద్యమ స్థాయికి  చేర్చాలి. అదే ప్రజా పంథా. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు తోటే గెలుస్తాం. ఒకప్పుడు మునుగుతాం అంతిమంగా ప్రజలే గెలుస్తారు. ప్రజలే చరిత్ర నిర్మిస్తారు అన్నాడు. అన్ని రకాల వర్గాల పార్టీలలో, సంస్థలలో వెదికినా  సరైన దారి దొరకక సొంత పార్టీ పెట్టాడు. అనారోగ్యం నుండి కోలుకుని మరల ప్రజలలోకి వస్తానన్నాడు.


ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక అంశం గ్రహించలేక పోయారు. లేదా తన  ప్రారంభ దశలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితి నిరంతరం అతని ఆలోచనను ప్రభావితం చేసింది. అర్థ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ మార్పు చెంది పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దశలోకి మారిపోయింది. గ్రహించ లేక పోయారు. కేవలం దొరల దోపిడీ రూపం మారింది. ఇంకా సామ్రాజ్యవాద దళారీ ప్రభుత్వాలే అనుకున్నాడు. అదానీ, అంబానీ, టాటా లను అమెరికా, రష్యా, చైనా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు, దేశ వనరులను దోచిపెట్టే దళారిలే

అనుకున్నాడు. కెసిఆర్ దొర కాదు, ప్రాంతీయ పెట్టుబడి దారుడు. అలా దొరలు పెట్టుబడి దారులుగా, అదానీ అంబానీ, టాటా లు గుత్త పెట్టుబడి దారులుగా  అయినారని, ప్రస్తుతం వైరుధ్యాలు మారిపోయి, పెట్టుబడి దారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ దశలోకి వెళ్ళింది అని గ్రహించ లేక పోయారు. తనకు తన మాతృ సంస్థ మధ్య సఖ్యత చెడడానికి కొంత మంది పార్టీ నాయకులు, సరిగా లేని తప్పుడు విధానాలే. వ్యక్తిగత ద్వేషాలే కారణమని భావించాడు. కులం కూడా కారణం అనుకున్నాడు. వాటితో పాటు సమాజంలో వచ్చిన పెట్టుబడిదారీ విధానంను గుర్తించలేదు. కులం కూడా ఉద్యమం క్షిణించడానికి కారణం అయ్యిందో ఏమో అనుకున్నాడు. అస్తిత్వ వాదం, అంబేడ్కర్ లను మార్క్సిజంతో సమన్వయం ద్వారా ప్రయోగం చేయాలని, సాయధ పోరాటం కొనసాగాలి., దానితో పాటు అలానే రాజ్యాంగం, ఓట్ల ద్వారా ప్రయోగం చేయాలని  అనుకున్నారు. కానీ, పూర్తి నమ్మకం కుదిరినట్లు లేదు. "అలజడి సుడిలో అల్లాడిన గద్దరన్న" తీరని తాండ్లాటలో ప్రజల మధ్యకు రావాలి అనుకున్నారు. ఇంతలో అమరత్వం పొందారు.

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణ, సంఘటిత, అసంఘటిత రంగంలో కార్మిక శ్రామిక వర్గంను పెట్టుబడిదారీ వర్గం మరింత శ్రమను దోపిడీ చేసే కార్మిక చట్టాలను తెస్తూ, కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు అమలుకు దూకుడుగా ఫాసిస్ట్ విధానంతో వున్న పెట్టుబడిదారీ మోడీ ప్రభుత్వంను, వర్గ చైతన్యంతో కార్మిక వర్గ పోరాటాలను నిర్మించి

కార్మిక, అసంఘటిత శ్రామిక వర్గం, రైతు కూలీలు మద్దతుతో తొలగించి సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంది.


సోషలిస్టు విప్లవం దశను సరిగా గుర్తించినట్లయితే ఈ ప్రయోగాలతో అభాసు పాలు కాక పోయేవాడు. సరైన ఒక విప్లవ పార్టీని నిర్మించే వాడు. నూతన ఉత్తేజంతో పూర్వ విప్లవ స్థాయిని చేరుకునే వాడు. నిరాశ చెందిన (బూర్జువా పార్టీలలో చేరకుండా) యువతను విప్లవ మార్గం పట్టించే వాడు.


గద్దర్ అమరత్వం తర్వాత  ప్రజాస్వామిక, విప్లవ పార్టీ, విప్లవ ప్రజాసంఘాలు, ఇతరులు గద్దర్ పై విపరీత వ్యాఖ్యానాలు, విమర్శలు, అంచనాలు, జోహార్లు తెలపాలా లేదా, రెడ్ సెల్యూట్  ఎందుకు చేశారు.., ఇలా చాలా చాలా... మరియు బూర్జువా పార్టీలలో కలిశాడు. దగ్గరయ్యాడు. చివరి దశలో తన విప్లవ ఆచరణను అంతా  పచ్చలు పచ్చలు చేసుకున్నాడు అంటూ.., వర్గ శత్రువు పైన కూడా కక్కని విషాన్ని, విద్వేషాన్ని వెదజల్లారు. అయితే, విశాల పీడిత శ్రామిక ప్రజల  హృదయాలలో వున్న ప్రేమ, నివాళులుల హోరులో గాలిబుడగలులా  తేలిపోయాయి.


సరే "నిందలేనిది బొందకూడా తెగదు" అని

గద్దరన్ననే చివరి రోజులలో ఇంటర్వ్యూలో చెప్పాడు. వివిధ పార్టీల దగ్గరకు వెళ్లినది., యాదగిరి గుట్ట, భద్రాచలం, రామానుజం, మోడీ మీటింగ్ దగ్గరికి పోయినది., రాహుల్ ను ముద్దు పెట్టడం నిజమే. నిజాలు నిజాలే., ఫాక్ట్ ను కాదన లేము. కానీ ఫాక్ట్ ల నుండి ఏమి నిర్దారణ చేసాము, ఇది ముఖ్యమైనది. అసలు ఎందుకు ఇలా చేశాడు?చేయడంలో ఉద్దేశం ఏమిటి?అతనికి లాభం ఏమిటి? అంత సుదీర్ఘ అనుభవం వున్న ఎన్నో క్లిష్టమైన, తాత్వికమైన, సున్నితమైన భావాలను సైతం సూక్ష్మంగా గ్రహించి సరళమైన ప్రజా బాణీలో

విశాల ప్రజానీకానికి తన పాట ద్వారా ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగిన గద్దరన్న ఈ చర్యల ద్వారా బద్నాం అవుతానని తెలియదా.!? తెలిసినా అనివార్యత ఏమిటి? ఆ అనివార్యత ముమ్మాటికీ

ప్రజల కొరకే, ప్రజల విముక్తి కొరకే, తను కలలు గన్న, నిరంతరం పోరాడిన సమసమాజం అంటే

సోషలిస్టు సమాజం కొరకే.

గద్దరన్న ఆశయాలను, పాటను ముందుకు తీసుకు వెళ్ళడమంటే అది సోషలిస్టు విప్లవంను విజయవంతం చేయడమే.


కామ్రేడ్ గద్దరన్నకు రెడ్ సెల్యూట్, 

విప్లవ జోహార్లు.


ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి.


 *షేక్ అబ్దుల్ కరీం* 

కో-కన్వీనర్,

కమ్యూనిస్ట్ యూనిటీ సెంటర్

Communist unity center.(CUC).

14-08-2023.

Comments

Popular posts from this blog

మోజేస్