రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా
రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా ?.
ఇటీవల మావోయిస్టు సీసీ సభ్యుడు అనారోగ్యం తో ప్రభుత్వానికి లొంగిపోతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుంది అన్నారు.
నిజంగా మావోయిజం బలపడుతుందా? గతి తార్కికంగా మార్క్సిజం ప్రకారంగా మావోయిజం బలపడటానికి ఆస్కారం ఉందా?. ముందుగా మావోయిజం అంటే ఏమిటో తెలుసుకుందాం.
మావోయిజం అంటే వెనుకబడిన ఫ్యూడల్, అర్ధ ఫ్యూడల్ సమాజాలలో సామ్రాజ్యవాద యుగంలో వలస దేశాలలో వలసలకు ,సామ్రాజ్యవాద ఆక్రమనకు వ్యతిరేకంగా పోరాటంలో కార్మిక వర్గం జాతీయ బూర్జువా వర్గం తో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది.
మొదట గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో ప్రజా సైన్యాన్ని నిర్మించి , విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, క్రమంగా పట్టణాలను ఆక్రమించుకోవాలి. ఆ విధంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలి. దీనిలో పార్టీ ,ప్రజా సైన్యం, ఐక్య సంఘటన ముఖ్య మంత్ర దండాలు గా ఉంటాయి.
చైనాలో ఫ్యూడలిజం బలంగా ఉండి జపాన్ సామ్రాజ్యవాద ఆక్రమణలో ఉన్న కాలంలో ఒక కేంద్రీకృత జాతీయ ప్రభుత్వం లేని చైనాలో కార్మిక వర్గం అంతగా లేని సందర్భంలో ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటుగా మారుమూల ప్రాంతాలను జయించుతూ భూస్వామ్యాన్ని, ఫ్యూడల్ ప్రభువులను నిర్మూలిస్తూ విముక్తి ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ప్రజాసైన్యాన్ని ఏర్పరచి చివరికి పట్టణాలను ఆక్రమించి విప్లవాన్ని విజయవంతం చేశారు. దీనిలో గేరిల్లా యుద్ధ పద్ధతులు, జపాన్ ఆక్రమణ సందర్భంగా జాతీయ బూర్జువావర్గంతో ఐక్య సంఘటన ఏర్పరచడం వల్ల విప్లవం విజయవంతం అయింది .
ఇది చైనాలో మావో నాయకత్వంలో విజయవంతం అయింది కనుక వెనుకబడిన దేశాలు ,ఫ్యూడల్ దేశాలు ,అర్ధ ఫ్యూడల్ దేశాలలో ఇలాంటి నమూనాతో చేసే విప్లవాలను, చైనాలో లాగా మావో ఆలోచన ప్రకారం మారుమూల పల్లెల నుండి ప్రజా సైన్యం ఏర్పరచి విముక్తి ప్రాంతాలను నిర్మిస్తూ పట్టణాలను విముక్తి చేయడం ను మావోయిజం అంటారు .
మనదేశంలో కూడా బ్రిటిష్ ప్రత్యక్ష వలస ఉండటం దేశవ్యాప్తంగా చిన్నచిన్న సంస్థానాలు ఉండడం ఉన్న కారణంగా చైనా లాంటి పందా పరిస్థితులు వుండేవి. నిజాం వ్యతిరేక సాయుధ తెలంగాణ పోరాటం అందులో భాగమే, కానీ 1947 అధికార మార్పిడి తర్వాత ఏర్పడిన జాతీయ బూర్జువా ప్రభుత్వం దేశంలోని అనేక సంస్థానాలను విలీనం చేసుకొని ఒక కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని ఏర్పరచింది. అయినప్పటికీ దేశంలో వాస్తవంగా భూస్వామ్య విధానం కొంత బలంగానే ఉండింది. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం వల్ల భూస్వామ్యం బలహీన పడుతున్నప్పటికీ ,వాటి ప్రభావం అవశేషాలు ప్రభలంగానే ఉన్న కారణంగా చైనా తరహా మావోయిస్టు ఆలోచన మార్గంలో విప్లవం అవలంబించటానికి భౌతిక పరిస్థితులు ఉన్నాయి. సిపిఐ ,సిపిఎం రివిజనీస్ట్ విధానాల వల్ల దేశంలో చెలరేగిన నక్సల్ బరి ఉద్యమం మావోయిస్టు విధానంలో సాయుధ పోరాటం ద్వారా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం వ్యవసాయక విప్లవం, పల్లెల నుండి పట్టణాలకు అంటూ ప్రారంభమై నక్సల్ బరి, శ్రీకాకుళం తర్వాత జగిత్యాల నుండి దండకారణ్యం వరకు విస్తరించింది .
90వ దశకంలో సరళీకరణ ప్రపంచీకరణలో భాగంగా,నక్సల్ ఉద్యమ ఫలితంగా గ్రామాలలో భూస్వామ్య విధానం వాటి అవశేషాలు క్రమంగా అంతరించి పెట్టుబడిదారీ సంబంధాలు విస్తరించాయి. దీనిని గుర్తించని ఉద్యమం క్రమంగా మైదాన ప్రాంత ప్రజలకు దూరం అవుతూ వెనుకబడిన దండకారణ్యంలోని ఆదివాసీ ప్రాంతాలకు విస్తరించి అక్కడ దశాబ్దాలుగా ఉండిపోయింది. ఈ కాలంలో దేశం లో పూర్తిగా పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందింది .
లెనిన్ తన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ లో చెప్పినట్లు “పెట్టుబడి ఎగుమతి, అది ఎగుమతి అయిన దేశాలలో పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధిని ప్రభావితం చేసి మిక్కిలి త్వరపరుస్తుంది”. ఆ విధంగావలస,అర్డవలస దేశాలలో పారిశ్రామికరణ జరుగుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వలస దేశాలు విముక్తి సాధించిన తర్వాత సుదీర్ఘకాలంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది, చెందుతూనే ఉంది కాబట్టి చైనా మాదిరి అర్ధ భూస్వామ్య వ్యవస్థ రోజురోజుకు క్షీణించి పోతున్నది. అంతా గ్లోబలైజేషన్లో,గుత్త పెట్టుబడి దారీ విధానం లో భాగం అవుతున్నాయి. గతి తర్కం మనకు చెప్పేది ఏమిటంటే ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూ ఉన్నత దశ కు అభివృద్ధి ఉంటుంది.
ఫ్యూడల్ సమాజం కూడా పెట్టుబడి దారి సమాజంగా అభివృద్ధి చెందుతుంది.
నేడు శ్రమ దోపిడీకి గురి అవుతున్న ప్రపంచ ప్రజల, కార్మికుల శత్రువు పెట్టుబడి దారి సామ్రాజ్యవాదమే. సామ్రాజ్యవాద పెట్టుబడికి విశాల ప్రపంచ కార్మిక వర్గానికి గల వైరుద్యం బలపడుతున్నది. ఇలాంటి స్థితిలో మావోయిజం రోజురోజుకు ఎట్లా బలపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా నేడు వలసదేశాలు లేవు, ఫ్యూడల్ దేశాలు కూడా లేవు .మారుమూల ప్రాంతాలకు కూడా పెట్టుబడిదారీ విధానం చేరిపోయింది. కాబట్టి నేడు మావో ఆలోచనకు భౌతిక పరిస్థితులు లేకుండా పోయాయి .నేడు ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు విప్లవ పరిస్థితులు ఉన్నాయి . మార్క్సిజం,లేనినిజమ్ వెలుగులో సోషలిస్ట్ విప్లవాలు విజయవంతం చేయాల్సి ఉంటుంది.
మన దేశంలో నేడు మావోయిస్టు ఆచరణకు ఏ మాత్రం అనుకూలం లేదు. నూతన ప్రజాస్వామిక దశ అంతం అయి నేడు సోషలిస్టు విప్లవ దశకు చేరుకున్నాం.
ఇంకా తమ జడత్వ అర్థవలస,అర్థ భూస్వామ్య భావనను వదిలి వదిలించుకోకపోతే ,పూర్తిగా కనుమరుగు అవుతారు.
బహుశా ఆ సీసీ నాయకుడు సామ్రాజ్యవాదానికి ప్రపంచ పెట్టుబడిదారీ విధానముకు వ్యతిరేకంగా కమ్యునిస్ట్
విప్లవోద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి అనవలసి వుండే.అతని ఉద్దేశం కూడా అదే అయి వుంటుంది,అలవాటులో అలా అని వుంటాడు.
ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మావోయిస్టు ఉద్యమాలు, జాతుల అస్తిత్వ గెరిల్లా సాయిధ పోరాట లు బలహీనపడి పార్లమెంటరీ మార్గంలో వచ్చి కొన్ని అధికారంలో కూడా వచ్చాయి. చీలి,పేరూ, ఫిలిప్పీన్స్, టర్కీ,నేపాల్ లాంటి దేశాలలో కూడా మావోయిస్టు ఉద్యమాలు విజయవంతం అయ్యే దారిలో లేవు, సుదీర్ఘకాలంగా బలహీనంగానే ఉన్నాయి.
మావో మార్క్సిజం,లేనినిజం ను చైనా యొక్క నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి విప్లవం సాధించారు. చైనా నిర్దిష్ట పరిస్థితులు ఒక వెనుక బడిన ఫ్యూడల్ దేశం, జపాన్ తో ఆక్రమించ బడిన సందర్భం లో జరిగిన విప్లవం.
మావో ఇజం అనలేము,ఆలోచన మాత్రమే. ఆనాటి కాలం లో వలస దేశాలు, ఫ్యూడల్ దేశాలు లో ఆలాంటి దశ వుండేది.అలాంటి ఫ్యూడల్,అర్థ ఫ్యూడల్ దేశాలు సామ్రాజ్యవాద యుగం లో నిరంతరం అభివృద్ధి చెందుతూ పెట్టుబడి దారీ దేశాలుగా మారే క్రమంలో లో క్షినిస్తునే వున్నాయి,అంతిమంగా కనుమరుగు అవుతాయి ఇది గతితార్కిక నియమం.
అటువంటపుడు మావో ఇజం( ?)( ఆలోచన) ఎలా మన గలుగు తుంది.
రోజూ రోజుకి ఎలా అభివద్ది అవుతుంది.
ఇలా అంటే పూర్తిగా మావో అందించిన ఆచరణాత్మక ,విప్లవ అనుభవాలు,చైనా సోషలిస్ట్ నిర్మాణం లో అతని కృషి నీ మొత్తం తిరస్కరించి నట్లు కాదు.
మార్క్సిజం,లెనినిజం మాత్రం తుది వరకు సోషలిస్ట్ విప్లవం కు,కమ్యునిస్ట్ సమాజం వరకు వర్ధిల్లు తుంది.
ఇప్పటికైనా మూల మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంత అధ్యయనం చేసి గతితార్కికంగా ఆలోచించి తమ మార్గాన్ని మార్చుకోవాలి.
ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి
మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి
ప్రపంచ కార్మికులారా ఏకంకండి
అబ్దుల్ కరీం
8-03- 2026.
Comments
Post a Comment